కుంభమేళా నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి: ఢిల్లీ

కుంభమేళాలో పాల్గొని వచ్చే భక్తులపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాను సందర్శించి తిరిగి వచ్చే ఢిల్లీ వాసులు తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఏప్రిల్ 14 నుంచి 17 వరకు జరిగిన కుంభమేళాలో పాల్గొన్న భక్తులు 24 గంటల్లో తమ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్ ద్వారా అప్‌లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, నేటి నుంచి ఈ నెల 30 వరకు కుంభమేళాకు వెళ్లాలనుకునే వారు కూడా తమ వివరాలను అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఫలితంగా వాళ్లని ట్రేస్ చేయడం ప్రభుత్వానికి సులభమవుతుందన్నారు. కుంభమేళాను సందర్శించి తమ వివరాలు అప్‌లోడ్ చేయని వారిని రెండు వారాలపాటు సంస్థాగత క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించింది.