సంక్రాంతి పండగకు 1500 ప్రత్యేక బస్సులు..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ఏపీ సర్కార్ ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ సంక్రాంతి పండగకు ఆర్టీసీ 1500 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. గత రెండేళ్ల నుంచి 2,200 సర్వీసుల వరకు నడిపిన ఆర్టీసీ.. కరోనా వైరస్ నేపథ్యంలో బస్సుల సంఖ్యను తగ్గించనుంది. ప్రయాణికుల డిమండ్‌ను బట్టి సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో సమావేశమైన ఎండీ కృష్ణబాబు సర్వీసులపై చర్చించారు.

ముఖ్యంగా సంక్రాంతి పండగకు ఎన్ని సర్వీసులు నడపాలనే అంశంపై చర్చించారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక బస్సులపై ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. అత్యధికంగా సర్వీసులు హైదరాబాద్‌కు తిప్పేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలకు రిజర్వేషన్‌లు ఫుల్ అయ్యాయి. ఈ జిల్లాలకు ప్రతి ఏటా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉభయగోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్సులను అధిక సంఖ్యలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.

గత ఏడాది పండగకు ఆర్టీసీకి రూ.67 కోట్ల మేర ఆదాయం రాగా, ప్రయాణికులపై భారం మోపకుండా 40 శాతం రాయితీతో ప్రత్యక సర్వీసులను ఆర్టీసీ నడిపింది. ఈ పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.