2021 టి20 ప్రపంచ కప్ ఆతిథ్యం మనదే

ఈ సంవత్సరం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వచ్చే సంవత్సరం ముందు అనుకొన్న ప్రకారంగా టీ20 ప్రపంచకప్‌ భారత్ వేదికగా జరుగుతుందా లేక ఆ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఆస్ట్రేలియాకు అప్పగిస్తదా అనే ప్రశ్నలు అందరిలో మెదిలాయి. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఐసీసీ సమాధానం ఇచ్చింది. ఈ సంవత్సరం వాయిదా పడిన టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరగనుందని, అలాగే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ నిలబెట్టుకుందని ఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాలను తీసుకుంది. 2021 టి20 ప్రపంచ కప్, అక్టోబర్‌-నవంబర్‌ మధ్యలో జరగనుంది. 2022 టి20 ప్రపంచ కప్, కూడా అక్టోబర్‌-నవంబర్‌ మధ్యలోనే జరగనుంది. అంతేకాకుండా భారత్, 2023 వన్డే ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యమివ్వనుంది.  

అదలా ఉంటే, కరోనా వైరస్‌ కారణంగా వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ వాయిదా పడింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7వ తేదీ వరకు న్యూజిలాండ్‌ వేదికగా జరుగాల్సిన, ఈ టోర్నీ 2022కు ఐసీసీ వాయిదా వేసింది.