ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది దుర్మరణం

కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 66 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

సోహాగ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం దుర్ఘటన చోటు చేసింది. రైలును మరో రైలు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సమీప దవాఖానలకు తరలించారు.

రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండేళ్ల క్రితం ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్‌సేస్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఇదే తరహాలో ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దశాబ్ద కాలంగా ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదాలు పరిపాటిగా మారాయి. దేశం నలుమూలలా రైల్వే భద్రతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయంటూ ఆ దేశ ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.