5 రోజుల్లోనే 3డీ ప్రింటెడ్ ఇల్లు.. ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్

దేశంలోనే తొలిసారి ఐఐటీ మద్రాస్ పూర్వవిద్యార్థులు ఐదు రోజుల్లోనే 3డీ ప్రింటెడ్ ఇంటిని నిర్మించి రికార్డు సృష్టించారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్‌రూములను అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ విధానంలో నిర్మాణ ఖర్చు 30 శాతం వరకు తగ్గనుండగా, భవన జీవితకాలం 50 ఏళ్లకుపైనే.

ఇంటిని ఆవిష్కరించిన అనంతరం నిర్మల మాట్లాడుతూ.. 2022 నాటికి అందరికీ ఇళ్ల పథకం కింద కోటి గృహాలను నిర్మించడం సవాలుతో కూడకున్న విషయమని, అయితే, ఈ 3డీ ప్రింటింగ్ విధానం ద్వారా అది నెరవేరే అవకాశం ఉందని అన్నారు. కాగా, ఐఐటీ మద్రాస్ పూర్వవిద్యార్థులు రూపొందించిన 3డీ ప్రింటింగ్ నమూనా ఆధారంగా చెన్నైకి చెందిన త్వస్థ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ఈ ఇంటిని ఐదు రోజుల్లోనే నిర్మించడం గమనార్హం.