అయోధ్య రామయ్య సన్నిధికి చేరిన 613 కిలోల గంట.!

అయోధ్యలోని రాముడి ఆలయంలో మోగించడానికి 613 కిలోల బరువున్న గంట బుధవారం అయోధ్యకు చేరింది. ఈ గంటను అయోధ్య ఆలయం కోసం తమిళనాడులోని రామేశ్వరంలో సిద్దం చేయించారు. కంచుతో తయారైన ఈ భారీ గంటను మోగిస్తే ఓం అన్న శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది.  ఇక ఈ గంట మీద రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితోపాటు వినాయకుడి ప్రతిమల తోపాటు జై శ్రీరాం అనే అక్షరాలు రాసి ఉంది. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన భక్తురాలు రాజ్యలక్ష్మి ప్రత్యేక వాహనంలో గంటను అయోధ్యకు తీసుకొచ్చి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందించారు.

ఈ గంటను భవ్య రామమందిరంలో ఏర్పాటుచేస్తామని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. రాముడి ఆలయానికి గంటను బహూకరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ మహత్తర కార్యంలో తనకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు భక్తురాలు రాజ్యలక్ష్మి.