అప్రకటిత కరెంట్ కోతలపై ప్రజాగ్రహం

  • నల్లచెరువు సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు, జనసేన పార్టీ నేతలు
  • కనీస సమాధానం చెప్పకపోవటంపై అధికారులపై ప్రజల ఆగ్రహం
  • జనసేన నేతలతో పోలీసుల వాగ్వాదం
  • చిన్న పిల్లలు, వృద్ధులు అల్లాడుతున్నారని ఆవేదన
  • ప్రజల గోడు పట్టని పాలకులు, అధికారులు
  • సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వేసవికాలం ప్రారంభమైన దగ్గర నుంచి తమ ఇష్టానుసారంగా విధిస్తున్న అప్రకటిత కరెంట్ కోతలతో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పోయిన కరెంట్ మూడు గంటల వరకు రాకపోవడంతో స్థానిక ప్రజలు, జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నల్లచెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వాహనాలు అడ్డుగా పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు జనసేన నాయకులకు వాగ్వాదం జరిగింది. అసలే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతూ ఉక్కపోతతో అల్లాడుతున్న పరిస్థితిలో కరెంట్ పోతే ప్రజలు ఎలా ఉండాలని ఆళ్ళ హరి ప్రశ్నించారు. ఉదయం అంతా కష్టపడి పనిచేసుకునే రోజు వారీ కూలీలకు కనీసం నిద్రపోయే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో విద్యుత్ కోతలతో నగర ప్రజలు అల్లాడుతుంటే స్థానిక శాసనసభ్యులు మాత్రం ఏసీ గదుల్లో ఉంటూ ఏసీ కార్లలో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. సర్ చార్జీలు అంటూ ప్రతీనెల అదనంగా డబ్బులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ నిరంతర విద్యుత్ సరఫరా చేయటంలో లేదని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరా ఆగిన సమయంలో కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు వ్యవహరించటం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి వంగి వంగి నమస్కారాలు పెట్టుకుంటూ తిరిగిన శాసనసభ్యులు, కార్పొరేటర్ లు కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే కంటికి కరువయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే సబ్ స్టేషన్ ను ముట్టడిస్తామని, పెద్దఎత్తున ప్రజల పక్షాన ఆందోళనలు చేపడతామని ఆళ్ళ హరి హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలసాని బాలకృష్ణ, శ్రీను, అచ్చరావు తదితరులు పాల్గొన్నారు.