రెడ్డివీధి స్మశాన వాటికలో మౌళిక సదుపాయాలు కల్పించండి

  • జిల్లా కలెక్టర్ ను కోరిన జనసేన నాయకులు
  • రథయాత్రకు రథం సిద్దమేనా..? దేవాదాయ శాఖ ఈవోతో జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మున్సిపాలిటీలోని రెడ్డి వీధి చివరన ఉన్న స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు చెందక అనిల్ కుమార్, రెడ్డి కరుణ, వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, నేయుగాపుల సురేష్, సిరిపురపు గౌరీ శంకర్, మానేపల్లి ప్రవీణ్ కుమార్, మర్రి చంద్రమౌళి, కునుకు రమేష్ తదితరులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో పార్వతీపురం మున్సిపాలిటీలోని స్మశాన వాటికల దుస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీలోని రెడ్డి వీధి చివరన ఉన్న స్మశాన వాటికను 22, 23, 24, 25 తదితర వార్డులకు చెందిన ప్రజలు వినియోగిస్తున్నారన్నారు. ఆ స్మశాన వాటికకు రాకపోకలు సాగించేందుకు రహదారి సదుపాయం లేదన్నారు. అలాగే బర్నింగ్ షెడ్డు లేదన్నారు. వెయిటింగ్ షెడ్ లేదన్నారు. నీటి సదుపాయం లేదన్నారు. ప్రహరీ గోడ మెయిన్ గేటు తదితర కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మశాన వాటికులకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే దీని పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో నాలుగు దిక్కుల్లో కనీసం నాలుగు స్మశాన వాటికులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలకు కొంత ఊరట కలుగుతుందన్నారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వారు వినతి పత్రం అందజేశారు.
రథయాత్రకు రథం సిద్ధమేనా…? అనంతరం వారు దేవాదాయ శాఖ ఈవో మండల ప్రసాద్ రావు ని కలిసి ఈ ఏడాది జగన్నాథ స్వామి రథయాత్రకు రథం సిద్ధమేనా అని ప్రశ్నించారు. గత ఏడాది కూడా రథం లేకుండా రథయాత్ర చేశారని ఈ ఏడాదికైనా రథాన్ని సిద్ధం చేయాలని కోరారు. రథం లేకుండా రథయాత్ర చేస్తే ఊరికి అరిష్టం దాపురిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతలు కోసం ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ కొత్త రథం తయారీ కుదరలేదన్నారు. గత ఎడాదిలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రథం లేకుండా రథయాత్ర చేయటం సరికాదని జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.