వరహాలు గెడ్డ ఆక్రమణలు తొలగించారా..??

  • పెద్దల జోలికి వెళ్లేందుకు అధికారులకు ఎందుకు భయం..?
  • ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని
  • అధికారులెందుకు..?
  • ప్రజలు ఛీ కొడుతున్నా సిగ్గు రాదా…?
  • ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం పట్టణానికి ప్రకృతి ప్రసాదంలా లభించిన వరహాల గెడ్డ ఆక్రమణలు తొలగించేదెప్పుడని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు ప్రశ్నించారు. ఆదివారం ఆ సమితి సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకర్రావుతో కలిసి పార్వతీపురం పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాలు గెడ్డ ఆక్రమణలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోకి ప్రవేశించే వరహాలు గెడ్డ రైతులకు సాగునీరు అందించడంతోపాటు, పార్వతీపురం పట్టణంలోని మురుగునీటినంతటినీ తనతో తీసుకువెళ్లి ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోంది అన్నారు. అటువంటి వరహాలు గెడ్డను కొందరు అక్రమార్కులు ఆక్రమిస్తున్నారన్నారు. వరహాలుగెడ్డ పార్వతీపురంలోకి ప్రవేశించే ప్రాంతం నుండి చివరకు పార్వతీపురం విడిచి పెట్టే ప్రాంతం వరకు మొత్తం అడుగడుగున కబ్జా చేశారన్నారు. పట్టణ మెయిన్ రోడ్డులో స్థలాల విలువ అధికంగా ఉండడంతో కొంతమంది బడా బాబులు దర్జాగా గెడ్డను కబ్జా చేసి పక్క భవనాలు నిర్మించారన్నారు. అయినప్పటికీ ఈ తతంగం కళ్ళముందే జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయం తదితర శాఖలకు చెందిన అధికారులు గానీ సిబ్బంది కానీ బడా బాబులు జోలికి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారన్నారు. అసలు ఆక్రమణదారులు ఎంతటి వారినైనా చర్యలు తీసుకునే అధికారం ఉన్న అధికారులు వారి దగ్గర ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. పేదలు బడుగు బలహీన వర్గాలపై చూపించే తమ ప్రతాపం పెద్దలపై ఎందుకు చూపించరని ప్రశ్నించారు. అలాగే వరహాలు గెడ్డ పార్వతీపురంలోకి ప్రవేశించే ప్రాంతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గెడ్డ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేసినప్పటికీ సంబంధిత అధికారుల్లో చలనం లేదన్నారు. వేణుగోపాల్ సినిమా హాలు మొదలుకొని వీరభద్ర సినిమా హాలు నుండి బైపాస్ కాలనీ దాటే వరకు గెడ్డను కబ్జా చేసారన్నారు. ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని అధికారులు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తీసుకుంటున్న జీతానికైనా పనిచేయాలని కోరారు. తాము గతంలో జిల్లా కలెక్టర్ స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరహాలు గెడ్డలో జంగిల్ క్లియరెన్స్, పూడిక తీత పనులు చేపడుతున్న అధికారులు, ఆక్రమణలు మాత్రం ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. గతంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఆక్రమణలు తొలగించి, వరహాలు గెడ్డ సరిహద్దులు గుర్తించి, గెడ్డ భూములను కాపాడాలని కోరామన్నారు. అయినప్పటికీ అటువైపు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వరహాలు గెడ్డ నిజస్వరూపాన్ని ప్రజలకు చూపించాలన్నారు. గతంలో ఉన్న రెండు పాయల వరహాలు గెడ్డను ఇప్పటికీ ఒక పాయ కనుమరుగు చేశారన్నారు. ఈ ఉన్న పాయను రక్షించాలని వారు కోరారు. ప్రజల కళ్ళముందే జరుగుతున్న కబ్జాలు చూసిన ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. అయినప్పటికీ అధికారులకు సిగ్గు రావటం లేదన్నారు. వరహాల గెడ్డ ఆక్రమణలు తొలగించని పక్షంలో సంబంధిత అధికారులతో పాటు కబ్జాదారులపైన చట్టపరమైన చర్యలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.