బెలగాం – వై.కే.ఎం. కాలనీ రోడ్డులో సెంటర్ వైడనింగ్ నిర్మించాలి

  • రోడ్డుకిరువైపులా, వెంకంపేట గోలీల జంక్షన్లో జరుగుతున్న ఆక్రమణలు తొలగించాలి
  • అంతర్రాష్ట్ర రహదారి కావడంతో భారీ వాహనాలు రాకపోకలతో నిత్యం రద్దీ
  • జిల్లా కేంద్రం అయ్యాక రద్దీ పెరగడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు
  • జిల్లా కలెక్టర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం బెలగాం నుండి వైకేయం కాలనీ వరకు గల మెయిన్ రోడ్డులో సెంటర్ వైడనింగ్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితరులు కలిసి ఆ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం పట్టణంలోని బెలగాం గెడ్డ వీధి మొదలుకొని వై.కె.ఎం. కాలనీ వరకు గల అంతరాష్ట్ర రహదారిలో జిల్లా కేంద్రం అయ్యాక రద్దీ పెరిగిందన్నారు. అంతరాష్ట్ర రహదారి కావడంతో అటు ఒడిస్సా కు, ఇటు ఆంధ్రకు రాకపోకలు సాగించే భారీ వాహనాలు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. వాటితో పాటు వై.కె.ఎం. కాలనీ, వెంకంపేట బొండపల్లి, ఎంఆర్ నగరం తదితర పార్వతిపురం మండలంలోని గ్రామాలతో పాటు మక్కువ, సీతానగరం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలు నిత్యం ఈ రహదారిని వినియోగిస్తున్నడంవల్ల విపరీత రద్దీ నెలకొందన్నారు. దీంతో ఈ రోడ్డులో సెంటర్ వైడనింగ్ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల ప్రారంభం, విడిచిపెట్టే సమయాలు ఉదయం, సాయంత్రం సమయంలో అయితే పరిమితికి మించి ఈ రహదారిలో రద్దీ నెలకొంటుంది అన్నారు. దీని వలన వాహన చోధకులు నియమ నిబంధనలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు తొక్కే విద్యార్థులు, ద్విచక్ర వాహనాలు నడిపే వృద్ధులు, మహిళలు, ఓవర్ స్పీడ్ గా వెళ్ళే యువత తరచూ ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఈ రోడ్డులో ప్రమాదాలకు గురైన వారు అంగవైకల్యంతో పాటు మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కాబట్టి తక్షణమే ఈ రోడ్లో సెంటర్ వైడనింగ్ ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నారు. అంతే కాకుండా ఈ రోడ్డుకు ఇరువైపులా కొంతమంది వ్యాపారులు రోడ్డును ఆక్రమించడంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు మరింత కారణం అవుతుందన్నారు. తక్షణమే రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న ఆక్రమణతో పాటు, వెంకంపేట గోలీల వద్ద జరిగిన ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా వారి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తగు చర్యలకు సంబంధించిన అధికారులను ఆదేశించారు.