స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి.. ఓటీటీలకు కేంద్రం ఆదేశాలు..

కరోనా కారణంగా సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతేకాకుండా సినీ పరిశ్రమకు పెద్దపెద్ద దెబ్బలు కూడా తగిలాయి. సినిమాలను తీసినా ఎక్కడ విడుదల చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. లాక్‌డౌన్ మొదలైన దగ్గర నుంచి సినిమాలను కొందరు ఓటీటీలో విడుదల చేశారు. వాటికి తోడు ప్రేక్షకులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో వెబ్ సిరీస్‌లకు కూడా ఆదరణ పొందాయి. లాక్‌డౌన్ టైంలో ఓటీటీల హవా ఎలా నడిచిందని, ఇప్పుడు ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీలు తమ జోరు తగ్గించుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ఫ్రైమ్‌ లాంటి ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సెన్సార్‌ బోర్డ్‌, టీవీ న్యూస్‌ ఛానల్స్‌ లాంటి సంస్థలు రూపొందించుకున్నట్లుగా ఓటీటీలు కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఓటీటీలో ప్రదర్శించే చిత్రం లేదా సిరీస్‌ను పర్యవేక్షించుకోవాలని సందరు సంస్థలకు తెలిపింది. తద్వారా ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.