మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

* ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు
ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో శ్లాఘించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ చంద్రయాన్-3లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టం. ఇంతటి విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలు సర్వదా అభినందనీయులు. ఇస్రో బృందానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను అడుగుపెట్టించి… దక్షిణ ధ్రువంపైకి వెళ్ళిన తొలి దేశంగా మనల్ని సగర్వంగా నిలిపారు. చంద్రయాన్-3 సాధించిన ఈ విజయంతో అంతరిక్ష రంగాన భారత్ అగ్రరాజ్యాల సరసన నిలిచిందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ విజయం మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ చంద్రయాన్-3 మిషన్ సంపూర్ణంగా విజయం సాధించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.