రైతులకు మెరుగైన ఆఫర్‌ ఇచ్చాం: తోమర్‌

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన రైతుల కోసం మెరుగైన ప్రతిపాదన ముందుకు తెచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు చర్చించి వారి నిర్ణయం వెల్లడిస్తే దానిపై ముందుకు వెళతామని అన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు సానుకూలంగా స్పందించి, తమ ఆందోళనను విరమిస్తారని తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు పునఃసమీక్షించాలని కోరారు. ఈ ప్రతిపాదనపై రైతులు సానుకూలత వ్యక్తం చేస్తారని, రైతు నిరసనలు ముగుస్తాయని మంత్రి ఆకాంక్షించారు.

వ్యవసాయ చట్టాలపై ఆందోళన బాటపట్టిన వారి సంఖ్య భారీగా లేదని, సంప్రదింపుల ద్వారా ఈ అంశం పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని అన్నారు. కాగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రైతాంగం నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. రైతు సంఘాలతో ఇప్పటివరకూ 11 సార్లు చర్చలు జరిగినా ప్రతిష్టంభనకు తెరపడలేదు. మరోవైపు గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో మంగళవారం దేశరాజధానిలో రైతులు ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టనున్నారు. ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతివ్వడంతో భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకున్నారు.