అమెజాన్ CEO బాధ్యతల నుంచి తప్పుకోనున్న బెజోస్

ప్రపంచ నెంబర్ 2 కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదిలోనే కంపెనీ CEO బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తన బ్లాగ్‌లో పోస్టు చేశారు. బెజోస్ 30 ఏళ్ల నుంచి అమెజాన్ సీఈవోగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు లేఖ రాసిన ఆయన.. అమెజాన్ అంటే ఒక ఆవిష్కరణ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చానని.. సీఈవో పదవి నుంచి తప్పుకోవడం ఇదే సరైన సమయమని అన్నారు. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికల్లా పదవి నుంచి తప్పుకొనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు.

బెజోస్ తాజా నిర్ణయంతో అమెజాన్‌కు కాబోయే తరువాయి బాస్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బెజోస్ సీఈవోగా తప్పుకునే కొద్దిరోజుల ముందు అమెజాన్ కొత్త సీఈవోను ప్రకటిస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే జెఫ్ బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా నియామకం కానున్నారని తెలుస్తోంది. బెజోస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై బెజోస్ మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జెస్సీ.. 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక పాత్ర పోషించారు.

77 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ 182 బిలియన్స్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. జెఫ్ బెజోస్ నిర్ణయంతో అమెరికా వ్యాపారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అయితే సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బెజోస్ ప్రకటించినప్పటికీ.. ఆ నిర్ణయం అమెజాన్ బిజినెస్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు.