1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర

* అవనిగడ్డలో బహిరంగ సభతో శ్రీకారం
కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. సభా నిర్వహణకు ఏర్పాట్లను జనసేన నాయకులు ప్రారంభించారు. వారాహి వాహనంపై నుంచి సభికుల్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయ యాత్ర 4వ దశగా కృష్ణా జిల్లాలో 5 రోజులపాటు కొనసాగనుంది. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని 2, 3 తేదీల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు సమయానుకూలంగా ప్రకటిస్తారు.

వారాహి విజయ యాత్రకు సమన్వయకర్తల నియామకం
కృష్ణా జిల్లాలో వారాహి యాత్రలో భాగంగా జరిగే కార్యక్రమాలను సమన్వయపరచడానికిగాను సమన్వయకర్తల నియామకానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గానికి పోతిన వెంకట మహేష్, తాతంశెట్టి నాగేంద్ర, మండలి రాజేష్, పెడన నియోజకవర్గానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అమ్మిశెట్టి వాసు, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గానికి ముత్తా శశిధర్, చనమల్ల చంద్రశేఖర్ లు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తూ ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి వీరు కృషి చేస్తారు.