ఢిల్లీ సరిహద్దుల్లో ఆగని ఉద్రిక్తత

ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 71 రోజులుగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. జనవరి 26 ఘటన తరువాత రైతులు వెనక్కి తగ్గుతారని అంతా అనుకున్నా, రైతులు మాత్రం వెనక్కి అడుగు వేయడం లేదు. పైగా ఆందోళనలు మరింత ఉదృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 6 వ తేదీన రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధం చేసేందుకు రైతులు నడుం బిగించారు. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వస్తుండటంతో ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారీకేడ్లు, సిమెంట్ దిమ్మెలతో సరిహద్దులను మూసేశారు. అంతేకాదు, ఢిల్లీ సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.