మయన్మార్‌లో అత్యవసర పరిస్థితిపై ఐరాస ఆందోళన

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి, అత్యవసర పరిస్థితిని ప్రకటించడంపై ఐరాస భద్రతా మండలి గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంగ్‌సాన్‌ సూకీ సహా ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని సూచించింది. ఆగ్నేయాసియా దేశంలో సైన్యం తిరుగుబాటు చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడంపై కౌన్సిల్‌ స్పందించింది. ఈ నెల 1న మయన్మార్‌లో మిలిటరి అత్యవసర పరిస్థితి ప్రకటించడం, రాష్ట్ర కౌన్సిలర్‌ ఆంగ్‌సాన్‌ సూకీ, ప్రెసిడెంట్‌ విన్‌ మైంట్‌, ఇతర నాయకులను ఏకపక్షంగా నిర్భందించడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే విడుదల చేసి, ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని యూఎన్‌ సభ్యులు సైన్యానికి సూచించారు. సురక్షితమైన, స్వచ్ఛంద, స్థిరమైన, గౌరవ ప్రదమైన పరిస్థితులను తిరిగి కల్పించాలని పిలుపునిచ్చారు. పౌర సమాజం, జర్నలిస్టులు, మీడియాపై ఆంక్షలు విధించడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యూఎన్‌ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ మీడియాతో మాట్లాడుతూ మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజాన్ని సమీకరిస్తామని పేర్కొన్నారు.