మరో రెండు నెలల్లో వైసిపి మొత్తం ఖాళీ: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నగరాభివృద్ధిని ఎమ్మెల్యే ఆళ్ల నాని తుంగలోకి తొక్కారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నగరంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యే నాని ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అట్టహాసంగా, ఊరేగింపుగా, విహారయాత్రకు వెళ్తున్నట్లు అధికారులు, వాలంటీర్లతో ఎమ్మెల్యే వెళుతూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. స్థానిక ప్రజలు మాత్రం నాని యాత్రను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే మాటలు అవాస్తవాలని ప్రజలు గమనించారన్నారు. ఒకటో డివిజన్ నల్లదిబ్బ ప్రాంతంలో కుళాయిలు మూగబోయాయని, ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. వెంకటాపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో నడవడానికి కూడా అనుకూలంగా లేవన్నారు. కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో ప్రజలను రోడ్లు భయపెడుతున్నాయన్నారు. గోతులమయంతో అధ్వానంగా తయారయ్యాయని, గర్భిణీ స్త్రీలు ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్తే మార్గమధ్యలోనే ప్రసవం అయ్యే పరిస్థితిలు నెలకొని ఉన్నాయన్నారు. ఈ రోడ్లు ఎమ్మెల్యేకు కనిపించలేదా అని రెడ్డి అప్పలనాయుడు నిలదీశారు. కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. వైయస్ఆర్ సీపీ వారికే వారి కండువాలు కప్పుతూ ఇతర పార్టీల నుంచి జాయిన్ అయినట్లుగా ఎమ్మెల్యే నాని కలరింగ్ ఇస్తున్నాడని దుయ్యబట్టారు. జనసేన పార్టీ నుండి వైసీపీలోకి ఏ ఒక్కరు కూడా వెళ్ళరని, వైసీపీ నుంచే జనసేన పార్టీలో చేరుతారని, మరో రెండు నెలల్లో వైసిపి మొత్తం ఖాళీ అయిపోతుందని స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గలో ప్రజలకు 25 వేల ఇల్లు కట్టించి ఇస్తామని గొప్పగా, బాహాటంగా చెప్పుకున్న ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇప్పుడు ఏ సమాధానం చెబుతారన్నారు. ఎక్కడ వేసిన గొంగ్గలి అక్కడే అన్నచందంగా జగనన్న ఇల్లు నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఇళ్శ నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసి 35 వేల రూపాయలు చొప్పున వసూలు చేశారని, ఇల్లు మాత్రం నిర్మించడం లేదన్నారు. ఏలూరు కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. డ్వాక్రా మహిళలు నెల నెల దాచుకుంటున్న పొదుపు సొమ్మును, రుణమాఫీ డబ్బును సైతం సీపీలు, ఆర్పీలు స్వాహా చేస్తున్నారని, ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే ఆళ్ళ నాన్ని దృష్టికి వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే బండారం ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి పసుపులేటి దినేష్, ప్రోగ్రాం ఆర్గనైజర్ బోండా రాము నాయుడు, నాయకులు నూకల సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.