అంగుళం భూమి కూడా చైనాకు వదులుకోం..

తూర్పు లద్దాక్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై గురువారం రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. లద్దాఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనను తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా అంగుళం భూమిని కూడా చైనాకు వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. దశలవారీగా రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరిస్తాయని ఆయన చెప్పారు. ఈ ఘర్షణలో ఇండియా కోల్పోయింది ఏమీ లేదని స్పష్టం చేశారు.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించిందని.. ఆయుధ సంపత్తిని భారీగా పెంచిందన్నారు. దీంతో మన సైన్యం కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో మన ధైర్యవంతులైన జవాన్లు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో మనమే పట్టు సాధించాము. దేశ సమగ్రత కోసం ఎంత వరకైనా వెళ్తామని మన జవాన్లు చాటి చెప్పారు. రెండు వైపులా వాస్తవాధీన రేఖను గౌరవించాలి అని రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దుల సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయని చైనాకు పదే పదే చెప్పామన్నారు.

ఏకపక్ష ధోరణి ఆమోదయోగ్యం కాదని చైనా అర్థమయ్యేలా వివరించామన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాండ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని.. ఈ ఒప్పందంతో భారత్‌, చైనా దశల వారీగా, పరస్పర సమన్వయంతో సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించనున్నట్లు వివరించారు.