బోగస్ ఇళ్ల పట్టాల దందాపై చర్యలు తీసుకోవాలి!

  • ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం లేకపోతే అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోరు?
  • చెరువుల్లో, ప్రభుత్వ స్థలాల్లో బోగస్ పట్టాలతో అక్రమ నిర్మాణాలు
  • బోగస్ పట్టాల అమ్మకాలు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టండి
  • జిల్లా జాయింట్ కలెక్టర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురంలో నడుస్తున్న బోగస్ ఇళ్ల పట్టాల దందాపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు కలిసి పార్వతీపురంలో జరుగుతున్న బోగస్ రెవెన్యూ ఇళ్ల పట్టాల దందాపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీలోని లక్ష్మీనాయుడు చెరువు, దేవుడి బంధ, నెల్లిచెరువు, కోదువాని బంధ, గిజబకాలనీ, వైకెయం కాలనీ, వివేకానంద కాలనీ, కొత్తవలస జి లేఅవుట్ తదితర ప్రాంతాలలో బోగస్ పట్టాలతో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఈ పట్టాలు దాదాపుగా రెవెన్యూ ఇళ్ల పట్టాలను పోలి ఉన్నాయన్నారు. దీంతో ఈ పట్టాల జారీ వెనుక రెవెన్యూ అధికారుల సిబ్బంది హస్తం ఉందేమోనన్న అనుమానాలను వ్యక్తపరిచారు ఎందుకంటే ఒకవేళ బోగస్ ఇళ్ల పట్టాల దందాలో రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయం లేకపోతే చెరువుల్లో, ప్రభుత్వ స్థలాల్లో పట్టపగలు పక్కాగా పక్కా భవనాలు నిర్మాణాలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను నియంత్రించకపోవడం చూస్తుంటే రెవెన్యూ ఉద్యోగులకు ప్రమేయం ఉన్నట్టుందని ఆరోపించారు. తక్షణమే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణదారుల వద్ద ఉన్న ఇళ్ల పట్టాలపై దర్యాప్తు నిర్వహించి బోగస్ పట్టాలపై పోలీస్ కేసులు నమోదు చేయాలన్నారు. అప్పుడు ఎవరు బోగస్ ఇళ్ల పట్టాలు అమ్మకాలు చేస్తున్నారో వారు బయటపడే అవకాశం ఉందన్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ చెరువులు, స్థలాలను బోగస్ పట్టాలతో లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్న ఈ దందా నడిపే వ్యక్తులు బయటపడే అవకాశం ఉందన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇప్పటికీ ఆయా చెరువులో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని, నిర్మాణాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. వాటికి ప్రోత్సాహం ఇస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలన్నారు. అనంతరం ఆయన జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.