తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుఘటన – 17కు చేరిన మృతుల సంఖ్య..

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 17 కు చేరగా, 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కాగా, 14 మందికి 60 నుంచి70 శాతం వరకు శరీరం కాలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రులు మధురై రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని సినీ నటి, బీజేపీ నేత గౌతమి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడని అన్నారు. అనుమతులను ఉల్లంఘిస్తూ విరుదునగర్‌ జిల్లాలో నిర్వహిస్తున్న టపాకాయల తయారీ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

కార్మాగారం యజమాని భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంఓ ప్రకటించింది.