45 రోజుల అనంతరం అమలులోనికి రానున్న టిక్ టాక్ బాన్ – ట్రంప్‌

చైనీస్‌ యాప్‌ టిక్‌ టాక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  నిషేధం విధించారు. కాని, ఆ నిషేధం 45 రోజులు తర్వాత వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్‌ గురువారం సంతకం చేశారు. ఈ 45 రోజులు లోపే టిక్‌టాక్‌ కొనుగోలు విషయంలో, ఎవరైనా దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుకోవచ్చు. కానీ అ 45 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా చట్ట పరిధిలో ఎవరైనా, ఏదైనా ఆస్తికి సంబంధించి బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌తో లావాదేవీలు నిర్వహించకూడదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి, లావాదేవీలు జరిపితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో ట్రంప్‌ సర్కార్ పేర్కొంది.

అంతేకాకుండా ఇదే రకమైన నిషేధం అమెరికా, టిక్ టాక్ తో పాటు, విచాట్ యాప్ పై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 15నాటికి చర్చలు పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేసింది.