కేరళలో ఘోర విమాన ప్రమాదం

కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌-కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. కూలిన వెంటనే విమానం రెండు తునకలయ్యింది. అయితే, విమానంలో మంటలు చెలరేగకపోవడం వల్ల ప్రమాద తీవ్రత అదుపులో ఉందని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో పైలట్‌ దీపక్‌ సాథే సహా 16 మంది ప్రాణాలు కోల్పోగా.. 123 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

ఇక ప్రమాదంపై తక్షణమే స్పందించిన సహాయ బృందాలు క్షతగాత్రులను వైద్యశాలలకు చేరవేశారు.

ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించగా…రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని కేరళ సీఎం విజయన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచాణకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఆదేశించారు. ఈ ప్రమాదం గురించి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని కూడా మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు