సోమశిల జలాశయాన్ని కాపాడాలి: నలిశెట్టి శ్రీధర్

  • బొగ్గేరు వాగు సప్లై ఛానల్ ను సందర్శించిన

ఆత్మకూరు: నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసేన నాయకులతో కలిసి ఆత్మకూరు బొగ్గేరు వాగు నుండి ఆత్మకూరు చెరువుకు నీటిని మళ్ళించే సప్లై ఛానల్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఈ సప్లై ఛానల్లో తుంగ పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న కారణంగా ఇటీవల తుఫాన్ వలన కురిసిన వర్షాలకు బొగ్గేరువాగు ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఆత్మకూరు చెరువు నిండలేదు. ఆత్మకూరు చెరువుకు బొగ్గేరువాగు నుండి నీటిని సప్లై చేసే ఈ సప్లై ఛానల్ లో వెంటనే తుంగను తొలగించి నీటి ప్రవాహం సక్రమంగా జరిగే విధంగా చూడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా రైపేరియన్ రైట్స్ పేరుతో జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇకనైనా అడ్డుకట్ట వేయాలని సోమశిల నీటిని ఆత్మకూరు చెరువునకు వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. రైపేరియన్ రైట్స్ అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో,నది పరివాహక ప్రాంతంలో ముందుగా సాగులోనికి వచ్చిన ఆయకట్టుకు సాగునీటి విడుదల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం. పెన్నా నది పరివాహక ప్రాంతం విషయానికి వస్తే 1882- 1886 మధ్య బ్రిటిష్ పరిపాలన కాలంలో సంగం మరియు నెల్లూరు ఆనకట్టలు వీటికి అనుబంధంగా చెరువులు నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాలకు 370 సంవత్సరాలు పూర్వమే 1515 -1520 మధ్య శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, ఆత్మకూరు, మహిమలూరు వంటి ప్రధాన చెరువులు నిర్మితమయ్యాయి. పైగా సోమశిల జలాశయం ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉంది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రైపేరియన్ రైట్స్ పేరుతో ఆత్మకూరు నియోజకవర్గం లోని చెరువులకు సోమశిల నీటిని ఇవ్వకపోవడం అత్యంత దారుణం. వెంటనే సోమశిల జలాశయం నుండి ఆత్మకూరు నియోజకవర్గంలోని చెరువులకు నీటిని విడుదల చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో జిల్లా వరప్రదాయని అయినటువంటి సోమశిల జలాశయం నుండి చెరువులకు సాగునీటిని మళ్లించే సప్లై ఛానల్ వరకు తీవ్ర అలక్ష్యానికి గురవుతున్నాయి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరాకాష్టకు చేరుకుంది అనేందుకు ఈ ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయిన పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల మరియు గుండ్లకమ్మ రిజర్వాయర్ల గేట్లు కొట్టుకొని పోవడం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితులను ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే సోమశిల రిజర్వాయర్ ముందు భాగంలో ఉన్న ఆప్రాన్ కొట్టుకొని పోయి మూడు సంవత్సరములు కావస్తుంది. డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిటి కొట్టుకుపోయిన భాగాన్ని పరిశీలించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చెప్పడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో జలాశయం ప్రమాదస్థితికి చేరుకుంది. ఈ జలాశయం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఈ సోమశిల జలాశయం మరమ్మత్తుల నిమిత్తం ఏ ఐ బి పి (యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం) కింద విడుదల చేసిన 30 కోట్ల రూపాయలను కూడా మరమ్మతులకు వినియోగించకుండా దారి మళ్ళించడం ఎంతో దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోమశిల జలాశయం ముందు భాగంలో దెబ్బతిన్న ఆఫ్రాన్ మరమ్మతులకు నిధులను కేటాయించి సోమశిల జలాశయాన్ని కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనడం జరిగినది.