రాయలసీమ తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిని జనసేనాని దృష్టికి తీసుకెళ్తా

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: కరువు అంటే కేవలం వర్షాభావమే కాదు, పంటలు పండక పోవడమే కాదు, ఒక జాతి ప్రజల బతుకు, భాష సంస్కృతి మానవీయ గౌరవం సర్వనాశనం కావడం. కరువు వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది. అంతకుమించి వ్యవసాయ సంస్కృతిని నాశనం చేస్తుంది. యువతను నిర్వీర్యం చేస్తుంది, మొత్తంగా పని సంస్కృతిని నాశనం చేస్తుంది. కరువు నుంచి బయటపడడానికి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని బతికించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. స్వర్గీయ ఎన్ టి రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానది మిగులు జలాలపై 1983లో తెలుగు గంగా, 1988లో హంద్రీనీవా, గాలేరు – నగరి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభించి 35 సంవత్సరాలు గడిచిన నేటికీ పూర్తి కాలేదు. తెలుగు గంగ” ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప చిత్తూరు, నెల్లూరు జిల్లాలో 5.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో తలపెట్టిన ప్రాజెక్టు. గాలేరు – నగరి” ప్రాజెక్టు కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలో 2 లక్షల 60 వేల ఎకరాల సాగుకు ఉద్దేశించిన ప్రాజెక్టు తర్వాత 3 లక్షల 20వేల ఎకరాలకు పెంచారు. హంద్రీనీవా” ప్రాజెక్టు ద్వారా కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాలకు 6 లక్షల 2500 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు, దాదాపు 33 లక్షల జనాభాకు మంచినీటి సౌకర్యం కల్పించుటకు ఈ పథకం ఉద్దేశించబడినది. పై ప్రాజెక్టులు ప్రారంభించి 35 సంవత్సరాలు అయినా నీటికి పూర్తి కాలేదు. గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో డబ్బులు కేటాయించి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టును ముందుకు కొనసాగించినా, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 సంవత్సరంలో 365 జీవో ద్వారా పెండింగ్ లో ఉన్న పనులన్నీ నిలిపేశారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో దొంగ లెక్కలు చెబుతూ డబ్బు కేటాయించకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రజలకు 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో హామీలు ఇచ్చి నెరవేత్తించిన 99% హామీలలో పైన కనపరిచిన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయా? లేదా? అని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం ఉమ్మడి జిల్లా జలసాధన సమితి వారు అనంతపురం నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన పార్టీ తరఫున, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి హాజరై తక్షణమే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాయలసీమ తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిని తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమలో పెండింగులో ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు అన్నింటిని తమ మేనిపోస్టులో పొందుపరిచి అధికారంలోకి వచ్చిన తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేసి కరువు కాటకాలతో అలమటిస్తున్న రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి వారు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేయడం జరిగింది.