ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తే ఊరుకునేది లేదు: సంజయ్‌

ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలను హెచ్చరించారు. 3 నెలల కోసం ఏడాది ఫీజు కట్టాల్సిందే అని ఒకవైపు విద్యార్థులను, మరోవైపు జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని వేధిస్తున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం వెనుక లాలూచీ ఏంటని నిలదీశారు. చాలా మంది టీఆర్‌ఎస్‌ నేతలకు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో వాటాలున్నాయని అన్నారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ఫీజుల వేధింపులు ఆగకపోతే యువ మోర్చా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని సంజయ్‌ హెచ్చరించారు. కార్పొరేట్‌ కాలేజీల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు వసూళ్లకు పాల్పడుతూ వాళ్ల అరాచకాలకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. సిబ్బందితో మీటింగ్‌ పెట్టుకుని వాళ్లను ఆదుకోవాలని విద్యాసంస్థలకు చెప్పినప్పటికీ స్పందించలేదని చెప్పారు.