పోరుకు మమతా పచ్చజెండా.. నందిగ్రామ్‌ నుంచి పోటీ..!

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీకి వేదిక సిద్ధమైంది. అందరూ అనుకున్నట్లుగానే పంతానికి పచ్చజెండా ఊపుతూ మమతా సంచలన నిర్ణయం తీసుకుంది. నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు శుక్రవారం ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 9న నందిగ్రామ్‌ వెళ్తానని, 10న నామినేషన్‌ వేస్తానని తెలిపారు. కాగా, ఇప్పటి వరకు మమతా భవానీపూర్‌ నుంచే బరిలో దిగుతున్నారు. ఇటీవలే టిఎంసి నుంచి బిజెపిలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల బెంగాల్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేందుకు.. సువేందును ఓడించేందుకు మమత ఈసారి నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌ నుంచి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యారును బరిలో దించుతున్నట్టు మమతా స్పష్టంచేశారు. నందిగ్రామ్‌ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ సువెందు పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. గతంలో సువేందు అధికారి బిజెపి నేతలకు మమతను 50 వేల మెజార్టీతో ఓడిస్తానని చెప్పారు.