నందిగ్రామ్‌ నుంచి నామినేషన్‌ వేసిన మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రచారం, నామినేషన్ల పర్వం జోరందుకుంది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేశారు. ఈ ఉదయం నందిగ్రామ్‌ వెళ్లిన ఆమె తన నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సారి ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దీదీ.. తన పోటీని నందిగ్రామ్‌ను మార్చుకుని ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. దీంతో భాజపా కూడా దీదీకి పోటీగా కీలక నేత సువేందు అధికారిని బరిలోకి దించుతోంది. ఈ నెల 12న సువేందు తన నామినేషన్‌ సమర్పించనున్నారు.

మరోవైపు తృణమూల్‌ పార్టీ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు కోల్‌కతా వెళ్లనున్న దీదీ.. మధ్యాహ్నం 2 గంటలకు కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.