గ్రాడ్యుయేట్ ఓటు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ-ఖమ్మం – వరంగల్‌, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేయించిన అధికారులు.. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించారు.

కాగా మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం తన ఓటు షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఉందని.. దానికి వేయడానికి ముందు ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలెండర్‌కు నమస్కారం పెట్టుకుని ఇక్కడకు వచ్చి.. విద్యావంతులందరికీ రాష్ట్రంలో మంచిచేయగల, సమస్యలు పరిష్కరించగలిగే అభ్యర్థికే తన ఓటు వేయాలని చెప్పారు. గ్రాడ్యుయేట్ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. అభివృద్ధికి పాటుపడే మంచి అభ్యర్థికి ఓటు వేయాలన్నారు.