ఏడాదిలోగా అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం: లోక్ సభలో నితిన్ గడ్కరీ ప్రకటన

ఏడాదిలోగా దేశంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. జీపీఎస్ ఆధారంగా ప్రతి వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నారని గడ్కరీ వెల్లడించారు. 7 శాతం మంది మాత్రం ఫాస్టాగ్ ఉపయోగించకుండా రెట్టింపు టోల్ కడుతున్నారని చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు 2016లో ఫాస్టాగ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ లేని వారికి ప్రస్తుతం రెట్టింపు ఫీజు వసూలు చేస్తున్నారు.

ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాల్లోనూ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటోంది. ఈ నేపథ్యంలో జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. వాహనాల కదలికలను బట్టి వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా టోల్ ఫీజును జమ చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది.