భక్తులకు శుభవార్త: రెండేండ్ల తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యలో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది శివుడి భక్తులకు శుభవార్త. ఈ సంవత్సరం అమర్‌నాథ్ తీర్థయాత్ర జూన్ 28 న ప్రారంభమై.. ఆగస్టు 22 వరకు కొనసాగనున్నది. అంటే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర మొత్తం 56 రోజుల పాటు కొనసాగుతుంది. అమర్‌నాథ్ యాత్ర మందిర బోర్డు తీర్థయాత్రకు రిజిస్ట్రేషన్ తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 14 నుంచి భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని బోర్డు సూచించింది.

ప్రతి సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా అమర్‌నాథ్ యాత్రను గత సంవత్సరం రద్దు చేయాల్సి వచ్చింది. ఆగస్టు 5 న జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్స్ 370, 35-ఏ ను రద్దు చేయడం, పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల 2019 లో కూడా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేయాల్సి వచ్చింది.

జమ్ముకశ్మీర్ అధికారులు ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశం జరిగింది.

మహాశివరాత్రి పండుగకు ముందు అమర్‌నాథ్ యాత్ర 2021 ప్రారంభ తేదీని ప్రకటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. 2021 జనవరిలో పుణ్యక్షేత్ర బోర్డు సమావేశం జరిగింది. రెండేండ్ల అనంతరం అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేండ్లుగా రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న యాత్రీకులు పేర్ల రిజిస్ట్రేషన్‌ కోసం వేచిఉన్నారు.

ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండటం, జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉండటం వంటి కారణాలతో ఈ ఏడాది అమర్‌నాథ్‌ తీర్థయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.