ప్రఖ్యాత సింగర్ ఆశా భోస్లేకు అరుదైన గౌరవం

ప్రఖ్యాత సింగర్ ఆశా భోస్లేకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు గాయని ఆశా భోస్లేను ఎంపిక చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఈసారి ఎవరికీ ఇస్తారనే దానిపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పలురకాల సూచనలను పరిగణలోకి తీసుకున్న కమిటీ సభ్యులు.. 2020 సంవత్సరానికి గాను మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఆశా భోసలేకు ఇవ్వాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆశా భోస్లే పేరును సభ్యులు సూచించడంతో ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కాగా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తుల విశిష్ట కృషిని మరియు విజయాలను గుర్తించడానికి 1996లో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన ఈ అవార్డుతో 10 లక్షల నగదు బహుమతి.. ఒక ప్రశంసా పత్రాన్ని పొందుతారు. కాగా భోస్లే సోదరి లతా మంగేష్కర్ 1997 లో అవార్డును అందుకున్నారు. అక్కాచెల్లెళ్లు ఈ అవార్డును అందుకోవడం అరుదైన విషయం.