రేపటి నుంచి పంజాబ్‌ మహిళలకు ఉచిత రవాణా పథకం

చండీగఢ్‌: పంజాబ్‌లోని మహిళలు ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు. పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మార్చి 5న ఈ పథకాన్ని విధాన సభలో ప్రకటించారు. మహిళలు, బాలికల సాధికారిత కోసం తెచ్చిన ఈ పథకానికి ఆ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 గురువారం నుంచి ఇది అమలులోకి రానున్నది.

పంజాబ్‌కు చెందిన మహిళలు వయసు, వారి ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ సంస్థలు నడిపే సిటీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికి ఆధార్‌, ఓటర్‌ కార్డు లేదా నివాసిత ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. అయితే ఏసీ, ఓల్వో బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు. ఈ ఉచిత రవాణా పథకం కింద పంజాబ్‌లోని 1.31 కోట్ల మంది మహిళలు, బాలికలు లబ్ధిపొందుతారని అధికారులు తెలిపారు.