కమల్ హాసన్ కోసం ఎన్నికల ప్రచార బరిలో కుటుంబ సభ్యులు..

తమిళనాడులో ఎల్లుండి (ఏప్రిల్ 6)న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఈ నేపథ్యంలో నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలో దిగుతోంది. ఇక కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కమల్ కోసం ఆయన కుమార్తె అక్షర హాసన్, సోదరుడి కుమార్తె సుహాసిని ప్రచారం చేస్తున్నారు.

ఎంఎన్ఎం పార్టీ ఎన్నికల గుర్తు టార్చిలైటు కాగా, టార్చి చేతబట్టిన సుహాసిని, అక్షర ఎంతో హుషారుగా డ్యాన్సులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో వీరి ప్రచారం ఆద్యంతం రక్తికట్టించేలా సాగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.