సినీ పరిశ్రమ, అనుబంధ వ్యవస్థలకు రాయితీలు

కోవిడ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటిస్తూ మంగళవారం జిఓ నెంబరు 40ను విడుదల చేసింది. చిత్ర పరిశ్రమపై ఆధారపడ్డ 70 శాతం కార్మికులు, అనుబంధ రంగాలు ఆర్థికంగా నష్టపోయాయని, పరిశ్రమను ఆదుకోవాలని వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం రాయితీలు ప్రకటించింది. 2020 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు విద్యుత్‌ ఛార్జీలు రద్దు, మల్టీపెక్స్‌లతో సహా థియేటర్లకు మరో ఆరు నెలల పాటు విద్యుత్‌ ఛార్జీలను వాయిదా వేశారు. బ్యాంకు రుణాలకు సంబంధించి ప్రభుత్వం గరిష్టంగా 50 శాతం వడ్డీ ఉపసంహరణ చేసింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు పొందిన రుణాల కోసం ఏడాదికి 4.5 శాతం గరిష్టంగా ఎ-కేంద్రాల్లో రూ.10 లక్షలు, బి, సి-కేంద్రాలకు రూ.5 లక్షల వడ్డీ ఉపసంహరణ వర్తిస్తుందని పేర్కొంది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల పాటు వర్తిస్తుందని జిఓలో తెలిపింది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ధికలిగేలా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొంది ఏపీ ప్రభుత్వం.