గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ!

దేశంలో పలుచోట్ల కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో.. సూరత్‌లోని న్యూ సివిల్‌ హాస్పిటల్‌ తనవంతుగా ఆ లోటును తీరుస్తోంది. ఇక్కడ గాలి నుంచి నిమిషానికి 2 వేల లీటర్ల మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నారు. సూరత్‌లో కొవిడ్‌ బాధితుల కోసం నిత్యం 250 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి సివిల్‌ ఆసుపత్రిలో ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్ప్సన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. విదేశీ సాంకేతికతతో పనిచేసే ఈ ప్లాంటు ద్వారా.. సహజ గాలిని కంప్రెస్‌ చేస్తారు. తద్వారా నైట్రోజన్‌, కార్బన్‌-డై-ఆక్సైడ్‌, ఇతర వాయువులను వేరుచేసి కేవలం ఆక్సిజన్‌ను మాత్రం తీసుకుంటారు. తర్వాత దాన్ని ఫిల్టర్‌ చేసి, పైప్‌లైన్‌ ద్వారా కొవిడ్‌ ఆసుపత్రులకు సరఫరా చేస్తునట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నిమేశ్‌ వర్మ చెప్పారు.