యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు

నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం బాలాలయంలో సుప్రభాతం చేపట్టిన పూజారులు వైష్ణవ ఆచారంగా పంచ నారసింహలను మేల్కొల్పి హారతి నివేదన, తులసీ పత్రాలతో అర్చన జరిపారు. స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.

నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగుతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయ, అధికారులు భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

సహస్రనామాలతో అష్టోత్తరం, భక్తులకు దర్శనమిచ్చే కవచ మూర్తులకు స్వర్ణపుష్పార్చన జరిపారు. కరోనా మహమ్మారి నుంచి సకల జనులకు విముక్తి కలిగించాలంటూ పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.