వీరజవాన్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ఆర్మీ జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసింది. సీఎం సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రజితకు సీఎం జగన్‌ లేఖ రాశారు. ”ప్రవీణ్‌కుమార్‌రెడ్డి దేశం కోసం చేసి ప్రాణత్యాగం చిరస్మరణీయం. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోంది. వారి త్యాగం వెలకట్టలేనిది.. ఆయన లేని లోటు పూడ్చలేనిది. అయినప్పటికీ ఈ శోక సమయంలో మీ కుటుంబానికి కాస్త ఆసరాగా ఉంటుందని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50లక్షలు మంజూరు చేయడమైనది. దయచేసి స్వీకరించగలరని కోరుతున్నాను” అని సీఎం లేఖలో పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన ర్యాడా మహేశ్‌ వీరమరణం పొందారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.