హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం

భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈటల సతీమణి, కుమారుడు, జమునా హేచరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులను పెట్టారని జమునా హేచరీస్‌ కోర్టుకు వివరించింది. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్, మెదక్‌ కలెక్టర్‌ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూముల కబ్జా చేశారనే ఆరోపణలతో ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే.