నేటి నుంచి ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి తెలంగాణ సర్కార్ సాయం

కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సాయమందించనుంది. మంగళవారం నుంచి వారికి రూ.2 వేలతో పాటు 25 కిలోల బియ్యాన్ని ఇవ్వనుంది. బోధన, బోధనేతర సిబ్బందిని కలిపి సాయానికి 1,24,704 మందిని ప్రభుత్వం అర్హులుగా తేల్చింది. వారి లెక్కల వివరాలను నిన్న సాయంత్రం వరకు తేల్చిన విద్యాశాఖ అధికారులు.. వాటిని పౌరసరఫరాల శాఖకు పంపించారు.

ఇవ్వాళ్టి నుంచి 24వ తేదీ మధ్య అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రేపటి నుంచి 25 మధ్య రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి దాదాపు 2.10 లక్షల మంది దాకా బోధన, బోధనేతర సిబ్బంది సర్కారు సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.56 లక్షల మందికిపైగా టీచర్లుండగా, 53 వేల మందికిపైగా బోధనేతర సిబ్బంది ఉన్నారు. కానీ, సర్కారు మాత్రం కేవలం లక్షా 24 వేల మందినే అర్హులుగా తేల్చింది.