పోర్టబుల్ వెంటిలేటర్… హైదరాబాదు సంస్థ ఘనత

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో, వారు కోలుకునే క్రమంలో వెంటిలేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే హైదరాబాదుకు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ… సీఎస్ఐఆర్, నేషనల్ ఏరోస్సేస్ ల్యాబ్స్ సహకారంతో పోర్టబుల్ వెంటిలేటర్ ను రూపొందించింది. దీనికి ‘స్వస్థ్ వాయు ఇన్వాజివ్ వెంటిలేటర్’ గా నామకరణం చేశారు.

ఇది ఓ బ్రీఫ్ కేసు పరిమాణంలో, మూడు కిలోల కన్నా తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఇళ్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు. దీనిపై అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ అధినేత బద్దం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాదుతో పాటు బెంగళూరు నగరంలోనూ ఈ మినీ వెంటిలేటర్ ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్టు తెలిపారు.

దీన్ని కరోనా బాధితులకే కాదు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఉపయోగించవచ్చని సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇళ్లలోనే కాకుండా, చిన్న ఆరోగ్య కేంద్రాల్లో ఉపయోగించేందుకు ఈ పోర్టబుల్ వెంటిలేటర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఈ తరహా సాంకేతికతతో కూడిన వెంటిలేటర్ ఇదొక్కటేనని, ఈ వెంటిలేటర్ పనితీరు పట్ల జాతీయ ఆరోగ్య భద్రతా ప్రమాణాల ల్యాబ్ లు సంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు.