గొల్లవిల్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని గొల్లవిల్లి గ్రామంలో 40శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారు అనే విషయం తెలిసి ఆందోళనకు లోనయ్యాను. 5వేల మంది ప్రజలున్న చిన్న గ్రామం ఇప్పుడు కరోనాతో విలవిలలాడుతున్న పరిస్థితులను మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామంలో ఇప్పటికే 20మంది కరోనా మూలంగా కన్నుమూశారనే విషయం బాధ కలిగించింది. ప్రభుత్వ యంత్రాంగం గొల్లవిల్లి గ్రామం విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలి. రెడ్ జోన్ ప్రకటించి, బ్లీచింగ్ జల్లిస్తే అక్కడి ప్రజల్లో భయాందోళనలు తగ్గవు. తక్షణమే ప్రత్యేక వైద్య బృందాలను అక్కడకు పంపించాలి. ఆ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ఇంటింటి ఆరోగ్య సర్వే, పరీక్షలు చేసి మందులు సరఫరా చేయాలి. సమీప ఆసుపత్రులలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగు చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది.

చమురు సంస్థల హామీల అమలుపై సమీక్షించండి

కోనసీమ ప్రాంతంలో అనేక చమురు సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. ఆ సంస్థలు సామాజిక బాధ్యతతో గొల్లవిల్లితోపాటు కోనసీమ గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కరోనా మొదటి వేవ్ సమయంలో కోనసీమలోని చమురు సంస్థలు సుమారు రూ.200 కోట్లతో వైద్య వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. ఏ మేరకు వాటిని అమలు చేశాయో ఉన్నతాధికారులు తక్షణమే సమీక్షించి.. ఆ హామీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలి.

గొల్లవిల్లి మాదిరే పలు గ్రామాలు కరోనాతో సతమతం అవుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేక ప్రణాళిక అనుసరించాలి. పల్లెలకు అంబులెన్సులు కూడా చేరడం లేదు. ప్రైవేట్ అంబులెన్సులకు భారీ మొత్తాలు చెల్లించలేక పేదలు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కొన్ని అంబులెన్సులు సిద్దంగా ఉంచాలి. గొల్లవిల్లితోపాటు పరిసర ప్రాంతాలలో కోవిడ్ బాధితులకు సాయం చేయడంలోను, ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి  తీసుకువెళ్లడంలోనూ జనసేన నాయకులు, జన సైనికులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా డబుల్ మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.