రఘురామకృష్ణరాజు బెయిల్‌పై సోమవారం విడుదల!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిన్న సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెయిల్‌కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకు అందని నేపథ్యంలో రఘురామ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో న్యాయవాదులు ఎల్లుండి కింది కోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని ఎంపీ రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో తనను పోలీసులు కొట్టారని ఎంపీ జిల్లా కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. ధర్మాసనం ఆదేశాల మేరకు రఘురామకు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన హైకోర్టు బెయిల్ నిరాకరించడంపై సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగిన అనంతరం ఆయనకు నిన్న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.