మాస్కు లేకుంటే 100 ఫైన్‌.. జగన్‌ ఆదేశం!

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకపోతే రూ.100 జరిమానా విధించాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 నియంత్రణ, నివారణపై సిఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాహల్లో కూడా రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీ ఉంచాలన్నారు. ఫంక్షన్‌ హళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు పరిధిలో ఎవరికైనా జ్వరం వస్తే వాలంటీర్ల ద్వారా గుర్తించి వెంటనే టెస్టులు చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సీజన్‌ సరఫరా ఉండాలని విశాఖ ప్లాంట్‌ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ రోజుకు 310 టన్నుల ఆక్సీజన్‌ సరఫరాకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 146 ఆస్పత్రుల్లో 26,446 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆక్సిజన్‌ నిల్వలు కూడా అధికంగానే ఉన్నాయని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, ఆదిమూలపు సురేష్‌, వైద్యారోగ్యశా అధికారులు తదితరులు పాల్గన్నారు.