ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతకం ఎగురవేసిన ముఖ్యమంత్రి

రాష్ట్రవ్యాప్తంగా శనివారం స్వాతంత్య్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందుపరేడ్‌ గ్రౌండ్‌లోని అమరుల స్థూపానికి నివాళులర్పించారు. గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ నాకు స్ఫూర్తి. వాళ్ల సంకల్ప బలానికి సలామ్‌.. వారికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో కరోనాపై పోరాడాలని టీఆర్‌ఎ్‌సపీపీ నేత కేకే పిలుపునిచ్చారు.