కరోనా తో మృతి చెందిన మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్

భారత మాజీ క్రికెటర్  చేతన్ చౌహాన్ కన్నుమూశారు. 73 ఏళ్ల చేతన్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ కేబినెట్ లో మంత్రి. కొన్నిరోజుల కిందట ఆయనకు కరోనా సోకింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఉదయం ఆయనకు కిడ్నీలు విఫలమైనట్టు వైద్యులు గుర్తించారు. ఆపై ఆయన అవయవాలన్నీ వైఫల్యం చెందడoతో చేతన్ చౌహాన్ కు మరణం సంభవించినట్టు తెలుస్తోంది.

తన కెరీర్ లో 40 టెస్టు మ్యాచ్ లు ఆడిన చేతన్ చౌహాన్ అప్పట్లో సునీల్ గవాస్కర్ కు ఓపెనింగ్ పార్ట్ నర్ గా బరిలో దిగేవాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఢిల్లీ క్రికెట్ సంఘానికి వివిధ పదవుల ద్వారా సేవలు అందించారు. ఆపై రాజకీయాల్లోనూ ప్రవేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ క్యాడర్ లో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చేతన్ చౌహాన్ మరణంతో అటు క్రికెట్ వర్గాల్లోనూ, ఇటు యూపీ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.