నేనూ టీకా వేయించుకుంటా: మాటమార్చిన రామ్‌దేవ్ బాబా

ఆయుర్వేదానికి మించిన వైద్యం లేదని, తాను కరోనా టీకా వేయించుకోబోనని తెగేసి చెప్పిన యోగా గురు రామ్‌దేవ్ బాబా మాట మార్చారు. అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఐఎంఏ ఆగ్రహానికి గురైన యోగా గురు.. ఇప్పుడు వైద్యులు దేవదూతలని కొనియాడుతున్నారు. తాను కూడా కరోనా టీకా వేయించుకుంటానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నిన్న హరిద్వార్‌లో విలేకరులతో మాట్లాడుతూ..  త్వరలోనే తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పారు. వైద్యులు ఈ భూమిపై తిరుగాడుతున్న దేవదూతల వంటివారని అన్నారు. టీకాలు అందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను రామ్‌దేవ్ బాబా స్వాగతించారు.

అంతేకాదు, ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు టీకా రెండు డోసులు తీసుకోవాలని కోరారు. కొవిడ్‌ కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అత్యవసర చికిత్స, సర్జరీలకు అల్లోపతి ఉత్తమమైనదని అన్నారు. ఔషధాల పేరుతో ప్రజలను దోపిడీ చేయడాన్నే తాను వ్యతిరేకిస్తాను తప్పితే తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని యోగా గురు స్పష్టం చేశారు.