కేంద్ర మాజీ మంత్రి కుమారమంగళం భార్య దారుణ హత్య

కేంద్ర మాజీ మంత్రి పి. రంగరాజన్ కుమార మంగళం భార్య కిట్టీ కుమారమంగళం హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఆమెను తమ నివాసంలోనే దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు.

కిట్టీ ఇంట్లో బట్టలు ఉతికే వ్యక్తి (ధోబీ) మరో ఇద్దరిని తీసుకుని దొంగతనం కోసం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడ్డాడని, ఒక గదిలో పనిమనిషిని బంధించి, కిట్టీని హత్య చేశారని పేర్కొన్నారు. రాత్రి 11 గంటలకు కిట్టీ హత్యకు గురయ్యారంటూ తమకు ఫోన్ వచ్చిందన్నారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని, అతడికి సహకరించిన ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలిస్తున్నామన్నారు.

కాగా, కిట్టీ కుమారమంగళం సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1984లో లోక్ సభకు ఎన్నికైన కిట్టీ భర్త పీఆర్ కుమారమంగళం.. 1991, 1992 మధ్య సహాయ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1992, 1993 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1998లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.