తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్.. భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర భేటీ

ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తరుణంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఈరోజు అత్యవసరంగా భేటీ అవుతోంది. నేటి రాత్రి 7.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి భారత్ అధ్యక్షత వహించనుంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఆప్ఘన్ ప్రజలకు హాని తలపెట్టకుండా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవహరించేలా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టిన భారత్… నెల రోజుల పాటు ఈ బాధ్యతను నిర్వహించనుంది. అయితే, భారత్ బాధ్యతలను చేపట్టిన వెంటనే ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆగస్ట్ 6 నుంచి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు.