భారత్‌లో ‘ము’ అనే కొత్త కరోనా వేరియంట్‌ కేసులు నమోదయ్యే అవకాశం: డబ్ల్యుహెచ్‌ఓ

కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే.. రాబోయే వినాయకచవితి, దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించింది. ఇక సామూహికంగా సమావేశం కావొద్దని.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశమయ్యే పరిస్థితులు తలెత్తితే.. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. అలాగే ప్రజలందరూ టీకాలు వేయించుకోవాలని తెలిపింది. ఇక భారత్‌లో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నిశితంగా పరిశీలిస్తోంది. కరోనా జాతికి చెందిన కొత్త వేరియట్‌ ‘ము’ భారత్‌లో కనిపించే అవకాశాలున్నాయని డబ్య్లుహెచ్‌ఓ హెచ్చరించింది. ‘ము’ వేరియంట్‌ కేసు తొలిసారిగా కొలంబియాలో ఈ ఏడాది జనవరిలో నమోదైంది. తర్వాత ఈ వేరియంట్‌ కేసులు కొన్ని దక్షిణ అమెరికా, ఐరోపాలో కూడా నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ వేరియంట్‌ను అరికట్టాలంటే.. కచ్చితంగా అందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని తెలిపింది.


కాగా, గడచిన 24 గంటల్లో 47,029 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్‌తో 509 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3.89 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇక కేరళలో క్రితంరోజు 32,808 కరోనా కేసులు నమోదవ్వగా.. 173 మంది వైరస్‌బారిన పడి మృతి చెందారు. ఇక సి 1.2 అనే కొత్త కరోనా వేరియంట్‌ వల్ల యూరప్‌, చైనా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, చైనా, మధ్యప్రాచ్యం నుండి వచ్చే విదేశీ ప్రయాణీకులను కచ్చితంగా కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు చూపించాలని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశించింది. ఇలా నెగెటివ్‌ రిపోర్టు చూపించాలనే నిబంధన సెప్టెంబర్‌ 3 నుంచి అమల్లోకి రానుంది.